< కీర్తనల~ గ్రంథము 98 >

1 ఒక కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి. 2 యెహోవా తన రక్షణను వెల్లడిచేశాడు. రాజ్యాలన్నిటికీ తన న్యాయాన్ని కనపరిచాడు. 3 ఆయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు. 4 లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి. 5 తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి. 6 బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి. 7 సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక! 8 నదులు చప్పట్లు కొట్టాలి. కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి. 9 లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.

< కీర్తనల~ గ్రంథము 98 >