< కీర్తనల~ గ్రంథము 75 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తష్హేత్ అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట. దేవా, మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నువ్వు నీ సన్నిధిని మాకు వెల్లడించావని నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మనుషులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారు. 2 నియామక కాలంలో నేను నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాను. 3 భూమి, దాని నివాసులంతా భయంతో వణుకుతున్నప్పుడు నేనే ఈ భూమి స్థంభాలను నిలబెడతాను. (సెలా) 4 అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను. 5 విజయం దొరుకుతుందని అంతగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ తలలు పైకెత్తి మాట్లాడవద్దు అని దుర్మార్గులతో చెప్పాను. 6 తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు. 7 దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు. 8 యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. అందులోని ద్రాక్షారసం పొంగుతూ ఉంది. అది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. ఆయన దాన్ని పోస్తున్నాడు. భూమిమీద ఉన్న దుర్మార్గులంతా ఆఖరు బొట్టు వరకు దాన్ని తాగాలి. 9 నేనైతే ఎప్పుడూ నువ్వు చేసిన కార్యాలను ప్రచారం చేస్తాను. యాకోబు దేవుణ్ణి నేను నిత్యమూ కీర్తిస్తాను. 10 ౧౦ నేను భక్తిహీనుల కొమ్ములను విరగగొడతాను. నీతిమంతుల కొమ్ములు పైకెత్తుతాను అని ఆయన అన్నాడు.

< కీర్తనల~ గ్రంథము 75 >