< కీర్తనల~ గ్రంథము 56 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. యోనతేలెం రెహూకిం అనే రాగంతో పాడేది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నపుడు అతడు రాసిన కీర్తన. దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు. 2 గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు. 3 నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను. 4 నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు? 5 రోజంతా వాళ్ళు నా మాటల్లో తప్పులు వెతుకుతారు. నాకు ఎప్పుడు హాని చేయాలా అని చూస్తుంటారు. 6 వాళ్ళు గుంపులు గుంపులుగా కాపు కాస్తారు. నన్ను చంపాలని నన్ను వెంబడిస్తూ ఉంటారు. 7 దేవా, నీ కోపంతో ప్రజలను అణగదొక్కు. వాళ్ళు చేస్తున్న దుష్ట క్రియల ఫలితాలు అనుభవించేలా చెయ్యి. 8 నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా. 9 నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు. 10 ౧౦ నా దేవుణ్ణి బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తాను. యెహోవాను బట్టి ఆయన వాక్కును ఘనపరుస్తాను. 11 ౧౧ నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను, మనుషులు నన్నేమి చేయగలరు? 12 ౧౨ దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు. 13 ౧౩ అందుకే నేను నీకు మొక్కుకున్నాను. నీకు స్తుతియాగాలు అర్పిస్తాను.

< కీర్తనల~ గ్రంథము 56 >