< కీర్తనల~ గ్రంథము 3 >

1 తన కొడుకు అబ్షాలోము నుంచి తాను పారిపోయినప్పుడు రచించినది. దావీదు కీర్తన. యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు. 2 దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు. (సెలా) 3 కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి. 4 నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు. (సెలా) 5 నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను. 6 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను. 7 యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు. 8 రక్షణ యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక. (సెలా)

< కీర్తనల~ గ్రంథము 3 >