< సామెతలు 31 >

1 రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, 2 కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను? 3 నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు. 4 ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు. 5 తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు. 6 ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి. 7 వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు. 8 మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు. 9 నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి. 10 ౧౦ సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది. 11 ౧౧ ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు. 12 ౧౨ ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు. 13 ౧౩ ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది. 14 ౧౪ వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. 15 ౧౫ ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది. 16 ౧౬ ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది. 17 ౧౭ ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది. 18 ౧౮ తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. 19 ౧౯ ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది. 20 ౨౦ దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది. 21 ౨౧ తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు. 22 ౨౨ ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు. 23 ౨౩ ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి. 24 ౨౪ ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది. 25 ౨౫ బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది. 26 ౨౬ ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది. 27 ౨౭ ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు. 28 ౨౮ ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు. 29 ౨౯ “చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు. 30 ౩౦ చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు. 31 ౩౧ ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.

< సామెతలు 31 >