< హొషేయ 9 >

1 ఇశ్రాయేలూ, అన్యప్రజలు సంతోషించేలా నీవు సంతోషించవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి నమ్మక ద్రోహం చేశావు. నీ కళ్ళాలన్నిటి మీద ఉన్న ధాన్యాన్ని బట్టి నీవు వేశ్యకిచ్చే మామూలు కోరావు. 2 కళ్ళాలు గాని ద్రాక్షగానుగలు గాని వారికి అన్నం పెట్టవు. కొత్త ద్రాక్షారసం ఉండదు. 3 వారు యెహోవా దేశంలో కొనసాగరు. ఎఫ్రాయిమీయులు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతారు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తింటారు. 4 యెహోవాకు ద్రాక్షారస పానార్పణం అర్పించరు. వారు అర్పించేవి ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకొనేది ప్రలాపం చేసేవారి ఆహారం వలే ఉంటుంది. దాన్ని తినే వారంతా అపవిత్రులైపోతారు. వారి ఆహారం వారికే సరిపోతుంది. అది యెహోవా మందిరంలోకి రాదు. 5 నియామక పండగల్లో, యెహోవా పండగ దినాల్లో మీరేమి చేస్తారు? 6 చూడండి, వారు నాశనం తప్పించుకుంటే. ఐగుప్తుదేశం వారికి పోగయ్యే స్థలంగా ఉంటుంది. మెంఫిస్ పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉంటుంది. వారి అపురూపమైన వెండివస్తువులను దురదగొండి మొక్కలు ఆవరిస్తాయి. ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగుతుంది. 7 శిక్షా దినాలు వచ్చేస్తున్నాయి. ప్రతికార దినాలు వచ్చేశాయి. “ప్రవక్తలు బుద్ధిలేని వారు, ఆత్మ మూలంగా పలికే వారు వెర్రివారు.” ప్రజల విస్తార దోషం, వారు చూపిన తీవ్ర శత్రుత్వం మూలంగా ఇశ్రాయేలువారు ఇది తెలుసుకుంటారు. 8 నా దేవుని దగ్గర ఉండే ప్రవక్త ఎఫ్రాయిముకు కావలివాడు. వారి దారులన్నిటిలో పక్షులకు పన్నే వలలు ఉన్నాయి. దేవుని మందిరంలో వారి పట్ల శత్రుత్వం ఉంది. 9 గిబియా రోజుల్లో లాగా వాళ్ళు చాలా దుర్మార్గులై పోయారు. యెహోవా వారి దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి పాపాలకై ఆయన వారికి శిక్ష విధిస్తాడు. 10 ౧౦ యెహోవా ఇలా అంటున్నాడు. “అరణ్యంలో ద్రాక్షపండ్లు దొరికినట్టు ఇశ్రాయేలువారు నాకు దొరికారు. వసంత కాలంలో అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు. అయితే వారు బయల్పెయోరు దగ్గరికి పోయారు. ఆ లజ్జాకరమైన దేవుడికి తమను అప్పగించుకున్నారు. తాము మోహించిన విగ్రహాల్లాగానే వారు కూడా అసహ్యులయ్యారు.” 11 ౧౧ ఎఫ్రాయిము విషయానికొస్తే వారి కీర్తి పక్షిలాగా ఎగిరిపోతుంది. ప్రసవమైనా, గర్భవతులుగా ఉండడం అయినా, గర్భం ధరించడమైనా వారికి ఉండదు. 12 ౧౨ వారు తమ పిల్లలను పెంచినా. వారికి ఎవరూ మిగల కుండా తీసేస్తాను. నేను వారి నుండి ముఖం తిప్పుకున్నప్పుడు అయ్యో, వారికి బాధ! 13 ౧౩ లోయలో నాటిన తూరు పట్టణం లాగా ఉండడానికి. నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకున్నాను. అయితే ఊచకోత కోసేవారి పాలు చెయ్యడానికి అది తన పిల్లలను బయటికి తీసుకు వస్తుంది. 14 ౧౪ యెహోవా, వారికి ప్రతీకారం చెయ్యి. వారికి నీవేమి ప్రతీకారం చేస్తావు? వారి స్త్రీలకు గర్భస్రావమయ్యే గర్భసంచులను, పాలు లేని స్తనాలను ఇవ్వు. 15 ౧౫ గిల్గాలులో వారు చేసిన పాపం మూలంగా. అక్కడే నేను వారికి విరోధినయ్యాను. వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇక నా మందిరంలోనుండి తోలి వేస్తాను. వారిని ఇక మీదట ప్రేమించను. వారి అధికారులంతా తిరుగుబాటు చేసేవారు. 16 ౧౬ ఎఫ్రాయిము రోగి అయ్యాడు. వారి వేరు ఎండిపోయింది. వారు ఫలించరు. వారు పిల్లలను కన్నప్పటికీ వారి ముద్దు బిడ్డలను నాశనం చేస్తాను. 17 ౧౭ వారు నా దేవుని మాట వినలేదు గనక ఆయన వారిని విసర్జించాడు. వారు దేశం విడిచి అన్యజనుల్లో దేశదిమ్మరులౌతారు.

< హొషేయ 9 >