< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 12 >

1 రెహబాము రాజ్యం స్థిరపడి, అతడు బలపడిన తరవాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. 2 వారు యెహోవాకు అపనమ్మకంగా ఉన్నందు వలన రాజైన రెహబాము పాలనలో ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు 1, 200 రథాలు, 60,000 మంది గుర్రపు రౌతులతో యెరూషలేము మీదికి దండెత్తాడు. 3 అతనితో బాటు ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు లెక్కకు మించి ఉన్నారు. 4 షీషకు యూదాకు దగ్గరగా ఉన్న ప్రాకార పురాలను పట్టుకుని యెరూషలేము వరకూ వచ్చాడు. 5 అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరికీ, షీషకుకు భయపడి యెరూషలేముకు పారిపోయి వచ్చిన యూదా అధిపతుల దగ్గరికి వచ్చి “‘మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు. 6 అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు, రాజు వినయంగా తల వంచుకుని “యెహోవా న్యాయవంతుడు” అని ఒప్పుకున్నారు. 7 వారు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూశాడు. యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చేయను. షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణ దయచేస్తాను. 8 అయితే నన్ను సేవించడానికీ, భూరాజులకు దాసులై ఉండడానికీ ఎంత తేడా ఉందో వారు గ్రహించడం కోసం వారు అతనికి దాసులవుతారు.” 9 ఐగుప్తురాజు షీషకు యెరూషలేము మీదికి వచ్చి, యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ధనాగారాలన్నిటినీ దోచుకుని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకు వెళ్ళాడు. 10 ౧౦ రెహబాము వాటికి బదులు ఇత్తడి డాళ్ళు చేయించి వాటిని రాజనగరం ద్వారాన్ని కాసే సైనికుల అధిపతులకి అప్పగించాడు. 11 ౧౧ రాజు యెహోవా మందిరంలోకి ప్రవేశించిన ప్రతిసారీ రక్షక భటులు వచ్చి వాటిని మోసేవారు. ఆ తరువాత వాటిని మళ్లీ గదిలో ఉంచేవారు. 12 ౧౨ అతడు తనను తాను తగ్గించుకోవడం వలన, యూదావారిలో కొంతమట్టుకు మంచి ఇంకా మిగిలే ఉండడం వలన, యెహోవా అతనిని పూర్తిగా నశింపజేయకుండా తన కోపాన్ని అతని మీద నుండి మళ్లించుకున్నాడు. 13 ౧౩ రెహబాము రాజు యెరూషలేములో స్థిరపడి పాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 41 సంవత్సరాల వయసు వాడు. తన నామాన్ని అక్కడ ఉంచడానికి ఇశ్రాయేలీయుల గోత్రాల స్థలాలన్నిటిలో నుండి యెహోవా కోరుకొన్న పట్టణమైన యెరూషలేములో అతడు 17 సంవత్సరాలు పాలించాడు, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. 14 ౧౪ అతడు యెహోవాను వెతకడంలో స్థిరంగా నిలబడక చెడు క్రియలు చేశాడు. 15 ౧౫ రెహబాము చేసిన ఇతర కార్యాలన్నిటి గురించి ప్రవక్త షెమయా, దీర్ఘదర్శి ఇద్దో రచించిన గ్రంథాల్లో రాసి ఉంది. వాటిలో ఇంకా వంశావళులూ రెహబాముకూ యరొబాముకూ జరిగిన నిరంతర యుద్ధాల వివరాలున్నాయి. 16 ౧౬ రెహబాము తన పూర్వీకులతో కూడా కన్నుమూసినవ్పుడు అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అప్పుడు అతని కొడుకు అబీయా అతనికి బదులుగా రాజయ్యాడు.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 12 >