< సామెతలు 10 >
1 ౧ జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు.
2 ౨ భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.
3 ౩ ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు.
4 ౪ శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.
5 ౫ బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.
6 ౬ నీతిమంతుని కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. దుర్మార్గుల మాట్లల్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.
7 ౭ నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.
8 ౮ జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.
9 ౯ నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది.
10 ౧౦ కళ్ళతో సైగ చేసేవాడు వేదనలు కలిగిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.
11 ౧౧ నీతిమంతుల నోటినుంచి వచ్చే మాటలు జీవజలపు ఊటలు. దుష్టులు తమలో దౌర్జన్యాన్ని దాచుకుని ఉంటారు.
12 ౧౨ ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.
13 ౧౩ వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.
14 ౧౪ జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.
15 ౧౫ ధనవంతుల ఆస్తి వారికి ఆశ్రయం కలిగించే కోట. దరిద్రుని పేదరికం వాడి నాశనానికి కారణం.
16 ౧౬ నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది.
17 ౧౭ బుద్ధిగల మాటలకు లోబడేవాడు తనకు జీవం కలిగించుకుంటాడు. మందలింపుకు సమ్మతించని వాడు దారి తప్పి నాశనం అవుతాడు.
18 ౧౮ అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.
19 ౧౯ వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.
20 ౨౦ ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి.
21 ౨౧ నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు.
22 ౨౨ యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.
23 ౨౩ మూర్ఖులు తమ చెడ్డ పనుల ద్వారా ఆనందం పొందుతారు. వివేకం గలవాడు తన జ్ఞానం పెంచుకోవడానికి సాధన చేస్తాడు.
24 ౨౪ మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది.
25 ౨౫ సుడిగాలి వీచినప్పుడు మూర్ఖుడు లేకుండా పోతాడు. ఉత్తముడు కలకాలం నిలిచి ఉండే స్తూపంలా నిలిచి ఉంటాడు.
26 ౨౬ సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.
27 ౨౭ యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం అధిక ఆయుష్షు ఇస్తుంది. భక్తిహీనుల జీవితకాలం తరిగిపోతూ ఉంటుంది.
28 ౨౮ నీతిమంతుల కోరిక సంతోషాలకు కారణం. మూర్ఖుల ఆలోచనలు వ్యర్ధమైపోతాయి.
29 ౨౯ నీతిమంతులకు యెహోవా మార్గం బలమైన కోట. పాపం చేసేవాళ్ళకు అది నాశన హేతువు.
30 ౩౦ ఉత్తముడు కదిలించబడక స్థిరంగా ఉంటాడు. మూర్ఖులకు దేశంలో స్థానం ఉండదు.
31 ౩౧ ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు.
32 ౩౨ ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి.