< మత్తయి 17 >

1 ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తయిన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు. 2 వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి. 3 అదే క్షణంలో మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు. 4 అప్పుడు పేతురు యేసుతో, “ప్రభూ, మనమిక్కడే ఉండిపోదాం. నీకిష్టమైతే ఇక్కడ నీకు, మోషేకు, ఏలీయాకు మూడు పాకలు వేస్తాను” అన్నాడు. 5 అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకు చాలా సంతోషం. మీరు ఈయన చెప్పేది వినండి” అని పలికింది. 6 శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లాపడిపోయారు. 7 యేసు వారి దగ్గరికి వచ్చి, వారిని తాకి, “భయపడకండి, ఇక లేవండి” అన్నాడు. 8 వారు కళ్ళు తెరచి చూస్తే, యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు. 9 వారు కొండ దిగి వచ్చేటప్పుడు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు” అని యేసు వారికి ఆజ్ఞాపించాడు. 10 ౧౦ అప్పుడు శిష్యులు, “మరి మొదట ఏలీయా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు?” అని అడిగారు. 11 ౧౧ అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు, “ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే. 12 ౧౨ అయితే నేను కచ్చితంగా మీతో చెప్పేదేమంటే, ఏలీయా ఇప్పటికే వచ్చేశాడు గానీ వారు అతణ్ణి గుర్తించలేదు. పైగా, అతణ్ణి ఇష్టం వచ్చినట్టుగా బాధించారు. అదే విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించబోతున్నాడు.” 13 ౧౩ బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. 14 ౧౪ వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి, 15 ౧౫ “ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు. 16 ౧౬ వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు. 17 ౧౭ అందుకు యేసు, “వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. 18 ౧౮ యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు. 19 ౧౯ తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు. 20 ౨౦ అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 21 ౨౧ మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు. 22 ౨౨ వారు గలిలయలో ఉన్నప్పుడు యేసు, “మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు, 23 ౨౩ వారు ఆయనను చంపుతారు. కానీ ఆయన మూడవ రోజు సజీవుడై తిరిగి లేస్తాడు” అని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు. 24 ౨౪ వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, “మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా?” అని అడిగారు. 25 ౨౫ అతడు, “అవును, చెల్లిస్తాడు” అన్నాడు. అతడు ఇంట్లోకి వెళ్ళి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన, “సీమోనూ, ఈ భూమి మీద రాజులు సుంకం, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా?” అని అడిగాడు. 26 ౨౬ అతడు, “బయటివాళ్ళ దగ్గరే” అని చెప్పాడు. యేసు, “అలాగైతే కొడుకులు స్వతంత్రులే. 27 ౨౭ అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు” అన్నాడు.

< మత్తయి 17 >