< అపొస్తలుల కార్యములు 18 >

1 ఆ తరువాత పౌలు ఏతెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చాడు. 2 పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ కనుగొన్నాడు. యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి కొద్ది కాలం క్రితమే ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు. 3 వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు. 4 అతడు ప్రతి విశ్రాంతిదినాన సమాజ మందిరంలో యూదులతో, గ్రీకు వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు. 5 సీల, తిమోతిలు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్కు బోధించడంలో మరింతగా నిమగ్నమయ్యాడు. అతనిలో ఆత్మ కలిగించే ఆసక్తివల్ల యేసే క్రీస్తని యూదులకు బలంగా సాక్షమిస్తున్నాడు. 6 ఆ యూదులు అతనిని ఎదిరించి దూషించారు. అతడు తన బట్టలు దులుపుకుని, “మీ రక్తం మీ తలమీదే ఉండుగాక. నేను నిర్దోషిని. ఇక నుండి నేను యూదేతరుల దగ్గరికి వెళ్తాను” అని వారితో చెప్పి 7 అక్కడ నుండి వెళ్ళి, దైవభక్తి గల తితియస్ యూస్తు అనే అతని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకుని ఉంది. 8 ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిసం పొందారు. 9 ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు. 10 ౧౦ ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు” అని పౌలుతో చెప్పాడు. 11 ౧౧ అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు. 12 ౧౨ గల్లియో అకయకు గవర్నరుగా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసుకుని వచ్చారు. 13 ౧౩ “వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు” అని ఆరోపణ చేశారు. 14 ౧౪ పౌలు మాట్లాడడం ప్రారంభించినపుడు గల్లియో, “యూదులారా, ఈ వివాదం ఏదో ఒక అన్యాయానికో, ఒక చెడ్డ నేరానికో సంబంధించినదైతే నేను మీ మాట సహనంగా వినడం న్యాయమే. 15 ౧౫ ఇది ఏదో ఉపదేశం గురించో, పేరుల గురించో, మీ ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకోండి. ఇలాంటి వాటి గురించి విచారణ చేయడానికి నాకు మనసు లేదు” అని యూదులతో చెప్పి 16 ౧౬ వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపివేశాడు. 17 ౧౭ అప్పుడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు. 18 ౧౮ పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. కెంక్రేయ ఓడరేవులో తన నాజీరు వ్రత సంబంధమైన జుట్టు కత్తిరించుకుని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు. 19 ౧౯ వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు. 20 ౨౦ వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు. 21 ౨౧ అతడు అంగీకరించక దేవుని చిత్తమైతే మరొకసారి వస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు. 22 ౨౨ తరువాత కైసరయ రేవులో దిగి యెరూషలేము వెళ్ళి, అక్కడి సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు. 23 ౨౩ అక్కడ కొంతకాలం ఉన్న తరువాత బయలుదేరి వరసగా గలిలయ ప్రాంతంలో, ఫ్రుగియలో సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాడు. 24 ౨౪ అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు. 25 ౨౫ అతడు ప్రభువు మార్గంలో ఉపదేశం పొంది, ఆత్మలో తీవ్రత కలిగి, యేసును గూర్చి అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడుతూ, సమాజ మందిరాల్లో ధైర్యంగా బోధించడం మొదలు పెట్టాడు. కానీ అతనికి యోహాను బాప్తిసం గురించి మాత్రమే తెలుసు. 26 ౨౬ ప్రిస్కిల్ల, అకుల అతని గురించి విని, అతనిని చేర్చుకుని దేవుని మార్గం గురించి పూర్తిగా విశదపరిచారు. 27 ౨౭ తరువాత అతడు అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అక్కడి విశ్వాసులకు ఉత్తరాలు రాసి అతనిని చేర్చుకోమని అక్కడి సోదరులను ప్రోత్సాహపరిచారు. అతడు అక్కడికి వచ్చి, దైవ కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. 28 ౨౮ లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తని రుజువు పరుస్తూ, బహిరంగంగా యూదుల వాదాన్ని గట్టిగా ఖండిస్తూ వచ్చాడు.

< అపొస్తలుల కార్యములు 18 >