< 2 కొరింథీయులకు 9 >

1 పరిశుద్ధుల కోసమైన ఈ సేవ గురించి నేను మీకు రాయనవసరం లేదు. 2 మీ ఆసక్తి నాకు తెలుసు. దాన్ని గురించి మాసిదోనియ ప్రజల ముందు మిమ్మల్ని పొగిడాను గదా! పోయిన సంవత్సరం నుండి అకయ ప్రాంతం వారు సిద్ధంగా ఉన్నారని వారికి చెప్పాను. మీ ఆసక్తి వారిలో చాలా మందిని ప్రోత్సహించింది. 3 అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ నేను చెప్పినట్టు మీరు సిద్ధంగా ఉండాలనీ సోదరులను పంపాను. 4 ఒకవేళ మాసిదోనియ వారెవరైనా నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకుంటే మీకే కాదు, మీ మీద ఇంత నమ్మకం ఉంచిన మాకు కూడా అవమానం కలుగుతుంది. 5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు. 9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది. (aiōn g165) 10 ౧౦ విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ౧౧ ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది. 12 ౧౨ మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. 13 ౧౩ ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. 14 ౧౪ మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. 15 ౧౫ వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.

< 2 కొరింథీయులకు 9 >